Monday, December 7, 2009

చదువుల చెట్టుకు పోలీసు చెద

పాఠాలు వినిపించాల్సిన విశ్వవిద్యాలయం పోలీసు పద ఘట్టనలతో మార్మ్రోగుతోంది. పవిత్ర విద్యాలయంలో విద్యార్థులపై ఖాకీల లాఠీలు విరిగిపోతున్నాయి. హోం మంత్రి ఆదేశాలను కూడా ఖాతరు చేయని పోలీసు అధికారులు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా ఉసురు తోడేస్తున్నారు... ఇదేమని అడిగే నాథుడు లేడు... ధైర్యం చేసి ఎవరైనా అడిగినా లాఠీలే వారికి జవాబు చెప్తున్నాయి... వాస్తవంగా ఉద్యమం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిని విడిచిపెట్టి విద్యార్థులపై పోలీసులు ఎందుకు కక్ష గట్టాల్సి వచ్చింది? ఏమిటీ దారుణం? విద్యాలయంలోకి పోలీసులు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? విశ్వవిద్యాలయంలో పోలీసుల తనిఖీలా? తరిమి కొట్టాల్సినంత పాపం విద్యార్థులేం చేశారు?

చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాల తరువాత మరోసారి రక్తసిక్తమవుతోంది. అప్పుడూ.. ఇప్పుడూ ఒకే కారణం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నదే నాడూ, నేడూ విద్యార్థుల డిమాండ్‌... ఆనాడు ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థి ఆందోళన 370 మంది ఆత్మ బలిదానంతో కానీ ముగియలేదు... ఇప్పుడు ధర్నాలు.. ఆందోళనలతో ప్రారంభమైన విద్యార్థి ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపటం ప్రారంభించారు.. రాజుకున్న అగ్గిని బలవంతంగా చల్లార్చే యత్నం చేస్తున్నారు.
నవంబర్‌ 29న తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టింది టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేశారు.. ఇంతవరకు బాగానే ఉంది. అదే సమయంలో కెసిఆర్‌ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యునివర్సిటీలో విద్యార్థులు ఓ ప్రదర్శన, ఓ ధర్నా చేశారు...
ఇదంతా చిన్న నిప్పుకణిక మాత్రమే. దాన్ని రాజేసి మంటగా మార్చింది మాత్రం నిస్సందేహంగా పోలీసు బలగాలే.. విద్యార్థులపై లాఠీలు విలయతాండవం చేశాయి.. పిల్లల్ని గొడ్లకంటే హీనంగా చూశారు... తరిమి తరిమి కొట్టారు..
విద్యార్థులేమైనా హింసాత్మకంగా ప్రవర్తించారా అంటే అదీ లేదు.. శాంతి భద్రతలు అదుపుతప్పాయా అంటే అదీ లేదు...అయినా పోలీసులు ఇంత విశృంఖలంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? పరిస్థితులు చేయిదాటినట్లయితే అప్పుడు ఏం చేయాలో పోలీసుల దగ్గర బోలెడు ప్రత్యామ్నాయాలు ఉండనే ఉంటాయి. కానీ ప్రదర్శనగా వెళు్తన్న విద్యార్థులను రెచ్చగొట్టి, వాళ్లపై జులుం చేయటం ఎక్కడి పోలీస్‌ రూల్‌?
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నది ఏ కెసిఆర్‌ కోసమో కాదు.. తెలంగాణ కోసమే... నిరాహార దీక్ష మలి రోజున కెసిఆర్‌ విరమించారన్న వార్త వంటూనే కెసిఆర్‌పై నిప్పులు గక్కింది ఈ విద్యార్థులే... వాళ్లతో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కారం ఆలోచించాల్సిన సర్కారు సెలవులు ప్రకటించటం ద్వారానో, ఆర్‌ఎఎఫ్‌ను పంపించటం ద్వారానో తొక్కేద్దామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.
1969 నాటి ఉద్యమానికి ఉస్మానియా నాయకత్వం వహించినట్లే.. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా ఉస్మానియా ఉద్యమానికి కేంద్రమవుతుందని సర్కారు భయపడుతున్నట్లుంది.. అందుకే ఈ ఉలికిపాటు.. కలవరపాటు...
ఇవాళ 80ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది. ఈ చీడను తొలగించేదెవరు? మళ్లీ చదువులు సాగేదెప్పుడు?
santosh kumar kovela