Thursday, December 3, 2009

హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా హైదరాబాదు విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. నిన్న ( 02-12-2009) సి.హరనాథ్, పసునూరి రవీందర్, యు.ధనరాజ్ తదితరులు రిలే నిరాహార దీక్షలో కూర్చుని పాటలతో, ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్సాహపరుస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగించారు. కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులే కాకుండా, రాష్ట్రంలోని మిగితా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా రిలే నిరాహార దీక్షా శిబిరంలో కూర్చుని, తమ మద్దతుని తెలిపారు. జాయింట్ యాక్షన్ కమిటి ( JAC) తరపున జరుగుతున్న ఈ ఉద్యమంలో నవీన్ కుమార్, మద్దిరాల సిద్ధార్థ, ఎన్. రాంబాబు, రామేశ్వర్, భరత్ నాయక్, లింగస్వామి, రాంచంద్రయ్య, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొంటున్నారునిన్న సాయంత్రం ఆచార్య హరగోపాల్, డా.పిల్లలమర్రి రాములు. డా. స్వరూపరాణి, డా. దార్ల వెంకటేశ్వరరావు, రత్నమాల, వేమూరి మురళీకృష్ణ,, సంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు తమ మద్దతుని తెలుపుతూ దీక్షాశిబిరంలో కొంత సేపు కూర్చున్నారు.ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఒక ముఖ్యమైన కార్యక్రమమని, దానికంటే ఎలాంటి తెలంగాణాను సాధించుకున్నామనేది కూడా అత్యంతముఖ్యమని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా, చాలా మంది హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రంగా గాని, స్వయంప్రతిపత్తి గల పాలనా భాగంగా గాని ఉండాలని వాదిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు లేకపోతే గుండెకాయ లేని రాష్ట్రంగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కృష్ణానదీ జలాల్లో రావలసిన వాటా దక్కించుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని హరగోపాల్ వివరించారు. హైదరాబాదు, సికింద్రాబాదులో భారతదేశానికి చెందిన అనేక భాషలు మాట్లాడేవారు, అనేక ప్రాంతాలవాళ్ళు నివశిస్తున్నారని, పొట్టచేతిపట్టుకొచ్చిన వాళ్ళతో తెలంగాణా ఉద్యమకారులకు ఎలాంటి ఇబ్బంది లేదనీ, వాళ్ళు భయపడవలసిన పనిలేదని చెప్పారు. ఒకవేళ అటువంటి వారిపై దాడులు గానీ, భయపెట్టడం గాని చేస్తే వారికి అండగానిలవవసి ఉందన్నారు. ఆంధ్రాప్రాంతాన్నుండి తెలంగాణా ప్రాంతానికి వచ్చి దోచుకొనేవాళ్ళతోనూ, ఆధిపత్యం చెలాయించేవాళ్ళతోనే తెలంగాణా ఉద్యమకారుల పోరాటమన్నారు.డా.పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ నైజాం కాలంలో దాశరథి వంటివాళ్ళు గేయాలు రాస్తే నేడు మావిద్యార్థులే ఆశువుగా పాటలు పాడి ఉద్యమానికి ఉత్సాహాన్ని కలిగిస్తున్నారని వారిని అభినందించారు. ప్రాంతాలు వేరైనా పీడన, ఆధిపత్యాన్ని నిరసించడానికి అన్ని ప్రాంతాల వాళ్ళూ కలిసి ఉద్యమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు.డా. దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తనది ఆంధ్రప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ ప్రాంతమనీ, ఇక్కడకు 1995 లో వచ్చానని, అప్పటికి ఆంధ్ర – తెలంగాణ అంటే సరిగ్గా తెలియదనీ, ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయని ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసాయని చెప్పారు. మీది ఆంధ్రా? అని ఎవరైనా అడిగితే “ ఔను..ఆంధ్ర ప్రదేశ్ .. మీది కాదా? “ అని అడిగేవాడినని, అప్పుడు మాది తెలంగాణ, రాయలసీమ అంటూ చెప్పేవారని, అప్పటినుండే నాకు ప్రాంతీయవైరుధ్యం గురించి తెలిసిందని పేర్కొన్నారు. క్రమేపీ అలాంటి విభజనకు సాంస్కృతిక, రాజకీయ ఆధిపత్యమే ప్రధాన కారణమని గమనించానని చెప్పారు. తాను తెలంగాణ అమ్మాయినే వివాహం చేసుకున్నానని తెలిపారు. ఇలా అన్ని ప్రాంతాల వాళ్ళూ సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకొంటే ఈ వైరుధ్యాలు తలెత్తి ఉండేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా అధిపత్యం చేస్తూ గానీ, పీడన కొనసాగించడం గాని జరుగుతుంటే దాన్ని మానవతావాదులు ఖండిస్తారు. పీడితుల పక్షాన నిలబడతారు. అలాంటప్పుడు ఒకే భాష మాట్లాడుతూ, ఒకే జాతిగా ఉన్న వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఖండించకుండా ఎలా ఉండగలమనీ, అందుకే తన సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నానని అన్నారు.హరగోపాల్ గారు మాట్లాడినట్లు ఆంధ్రాప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలంటే తెలంగాణా ప్రాంతానికి ఏ ఆంధ్రావాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందో, ఒకవేళ ప్రత్యేక తెలంగాణ వస్తే అందరినీ పంపేస్తారా? లేక పోతే పొట్టకూటికోసం వచ్చిన వాళ్ళనీ తరిమేస్తారా? అనే విషయాలపై ఉద్యమకారులు స్పష్టంగా వివరిస్తే, అప్పుడు తెలంగాణా లో స్థిరపడిన ఆంధ్రాప్రాంతప్రజలు కూడా ఉద్యమానికి మరింత మద్దతునిస్తారని దార్ల సూచించారు.డా. స్వరూప రాణి మాట్లాడుతూ తెలంగాణా వారికి పోరాట చైతన్యం పుట్టుకతోనే వచ్చిందనీ, ఆ చైతన్యం నేడు మరింతగా బహిర్గతం కావలసి ఉందని పేర్కొన్నారు. హైదరాబాదు ప్రాంతంలో నిర్మించిన ఆంధ్రాప్రాంతీయుల భవనాలు, కట్టడాలు ధ్వంసం చేసి వెళ్ళిపోతామని కొంతమంది ఆంధ్రావాళ్ళు ప్రకటిస్తున్నారని, అలా చేస్తే వాటిని వెంటనే నిర్మించుకోగల సత్తాకూడా తెలంగాణా వారికి ఉందని పేర్కొన్నారు.ఇంకా సంగిశెట్టి శ్రీనివాస్, రామయ్య,తదితరులు ప్రసంగించి సంఘీభావాన్ని ప్రకటించారు.
Posted by డా.దార్ల

ఉద్యమాన్ని మేమే నిర్మించుకుంటాం

వరంగల్‌, మేజర్‌న్యూస్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీలతో సంబంధం లేకుండా తామే కలిసికట్టుగా పోరాడి సాధించుకుంటామని, ఇందు కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మంగళవారం యూనివర్సిటీలోని ఎస్‌డి ఎల్‌సిఇ కేంద్రం ప్రాంగణంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను జనశక్తి నేత కూర రాజన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. సీతారామారావు, మానవ హక్కుల వేదిక నాయకులు డాక్టర్‌ బుర్ర రాములు ప్రారంభించారు.
కూర రాజన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక కోరిక అన్నారు. విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలకు మద్దతుగా ఉద్యమాన్ని బలోపేత చేయడం ఆదర్శనీయమన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలను పక్కన బెట్టి విద్యార్థులే ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్ల రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు జంకు పుట్టించిందన్నారు. తెలంగాణ నడి బొడ్డున ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కూర రాజన్న కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిహెచ్‌ దినేష్‌ కుమార్‌, ప్రొఫెసర్లు మురళీ మనోహర్‌, కె. వెంకట నారాయణ, సాంబయ్యలు తదితరులు పాల్గొన్నారు.

ఓ.యులో మార్మోగుతున్న తెలంగాణ నినాదం

ఓ.యులో మార్మోగుతున్న తెలంగాణ నినాదం
తార్నాక, మేజర్‌న్యూస్‌:ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ నినాదం మార్మోగుతున్నది. లెఫ్ట్‌, రైట్‌ అనే సిద్దాంతాలను పక్కన పెట్టి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ.యు ఆర్ట్స్‌ కళాశాల ముందు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాయి. అమర వీరుల త్యాగాల గుర్తు చేసుకుంటూ ….. అనవసర బలిదానాలు చేయొద్దని కోరుకుంటూ ఉద్యమాన్ని తెలంగాణ జిల్లాల్లో ప్రతి పల్లెకు విస్తరించాలని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ద్రోహుల పేరుతో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మను మంగళవారం ఆర్ట్స్‌ కళాశాల బస్టాప్‌ చెట్టు వద్ద విద్యార్థులు ఉరితీశారు.
‘‘ ఆడుదాం.. డప్పుల్లో దరువేయిరా…. పల్లె తెలంగాణ పాట పాడరా..’’ అంటూ అరుణోదయ గాయకురాలు విమల విద్యార్థుల దీక్షా శిబిరం పాల్గొన్నారు. ఇంకా గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్‌, వరంగల్‌ రవి, దరువు అంజన్న, కోటి తదితరులు తెలంగాణ పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. రాజకీయ నాయకులు 1969 నుంచి నేటి వరకు మోసం చేస్తున్నారనే అందువల్ల తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే నాయకత్వం వహించాలని, ఉద్యమాన్ని ప్రతి పల్లెకు . యూనివర్సిటీ నుంచి పాఠశాల వరకు తీసుకుపోవాలని తెలంగాణ ఐక్యకార్యాచరణ నాయకులు ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ అన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌ కన్వీనర్‌ అల్లం.
నారాయణలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుపోవాలని అన్నారు. తెలంగాణ సాధించేవరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. తెలంగాణ టీచర్స్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మనోహర్‌ రావు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు చేపట్టే తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌లను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకులు మంద.కృష్ణ మాదిగ మాట్లాడుతూ పరిణితో చేసిన విద్యార్థి ఉద్యమ నాయకత్వంతోనే తెలంగాణ వస్తుందన్నారు.
విద్యార్థుల దీక్షలో ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌, ఓ.యు ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. సుదర్శన్‌రావు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌ కో కన్వీనర్‌ పిట్టల శ్రీశైలం, ఓ.యు ప్రొఫెసర్స్‌ జె. ముసలయ్య, శ్రీరామ్‌ వెంకటేశ్‌, వి. జగదీశ్వర్‌రావు, మల్లేష్‌, చంద్రునాయక్‌, లక్ష్మీనారాయణ, ఇటిక్యాల పురుషోత్తం, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, పివోడబ్లు నాయకురాలు సంధ్య, ఇఫ్టూ నాయకులు ప్రదీప్‌, ఎస్‌ఎల్‌ పద్మ, కార్మిక నాయకులు చంద్రన్న, తెలంగాణ ఐక్యకార్యచరణ సభ్యులు ఆకుల భూమయ్య, కొల్లూరి చిరంజీవి, ఎల్‌హెచ్‌పిఎస్‌ నాయకులు బెల్లయ్య నాయక్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం విఠల్‌, మహాజన ఫ్రంట్‌ నాయకులు ఉ.సాంబశివరావు, ఓ.యు టైమ్‌ స్కేల్‌ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్‌గౌడ్‌, నారాయణ, ఓ.యు తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు నాగేశ్వర్‌, వెంకట్‌లు, తెలంగాణ మాదిగ దండోరా నాయకులు దేవని. సతీష్‌ మాదిగ, తెలంగాణ బి.సి విద్యార్థిసంఘం నాయకులు రామారావు గౌడ్‌, బిఎస్‌పి ఎ.పి నాయకులు నల్లా.సూర్యప్రకాశ్‌, ఓ.యు అకాడమిక్‌ కన్సటెంట్స్‌ నాయకులు డాక్టర్‌ లక్ష్మణ్‌, డాక్టర్‌ ప్రేమయ్య, మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శ వంగపల్లి. శ్రీనివాస్‌ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా పాల్గొన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో పిడికిలి బిగియించిన విద్యార్థినులు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉస్మానియాయూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎప్పుడూలేనంతగా ఈ సారి అధిక సంఖ్యలో అమ్మాయిలు ర్యాలీలు, ధర్నాలు, రిలే దీక్షల్లో పాల్గొనడం గమనార్హం. అంతేకాదు పిడికిలి బిగియించి జై తెలంగాణ… జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ సాధన ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషిస్తామంటూ విద్యార్థినులు పేర్కొంటున్నారు.
Posted by నాదెళ్ళ శ్రీధర్ on డిసెంబరు 3, 2009 at 04:57