Thursday, January 28, 2010

ఉస్మానియ గర్జనలో ఎవరేం మట్లాడారు...

మీరివ్వకుంటే.. మేం తెచ్చుకుంటాం..


ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ విద్యార్థులు గర్జించారు. రాజకీయాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఏకమయ్యారు. తెలంగాణ నినాదాలు.. ఆటపాటల్తో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణం ఆదివారం సాయంత్రం మార్మోగింది. ప్రత్యేక రాష్ట్రం తమ చిరకాల స్వప్నమని, రాష్ట్రం ఏర్పడేదాకా పోరాటం సాగిస్తామంటూ తమ భవిష్యత్‌ కార్యాచరణను స్పష్టంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీన అన్ని పార్టీలతో నిర్వహిస్తున్న సమావేశానికన్నా ముందే రాష్ట్రానికి చెందిన రాజకీయ పక్షాలన్నీ తెలంగాణపై తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్‌చేశారు. ఐదో తేదీనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించాలని విద్యార్థులు ముక్తకంఠంతో డిమాండ్‌చేశారు. తేడా వస్తే.. తమ ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆర్ట్స్‌ కాలేజీ ఎదురుగా నిర్వహించిన ‘విద్యార్థి గర్జన'కు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు భారీఎత్తున తరలివచ్చారు. 2010ని తెలంగాణ సాధన సంవత్సరంగా ప్రకటించినందున అవసరమైతే విద్యార్థులందరూ పరీక్షలను బాయ్‌కాట్‌ చేద్దామని, అయిదో తేదీన రైల్‌రోకో, రాస్తారోకోలు చేద్దామని పిలుపునిచ్చారు..



తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే ముందుండి నడిపించాలని విద్యార్థి గర్జనకు హాజరైన వక్తలు పిలుపునిచ్చారు. తెలంగాణపై సంప్రదింపులొద్దనీ, సంధికి సమయం కాదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో యుద్ధం జరగాలి. అందులో ముందు ఉండాల్సిన బాధ్యత విద్యార్థులదే' అని పేర్కొన్నారు. తెలంగాణపై ఢిల్లీలో చర్చలు అవసరం లేదని, పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్‌చేశారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టనీయం. జనవరి 10 నుంచి జూన్‌ 10లోగా తెలంగాణ ప్రక్రియ పూర్తిచేయాలి. 53 ఏళ్ల తెలంగాణ పోరాటానికి విద్యార్థులుగా ముగింపు పలకాలనుకుంటున్నాం'' అని జేఎసీ నేతలు స్పష్టంచేశారు. తెలంగాణలోని రాజకీయ నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో అందరూ భాగస్వామ్యులు కావాలన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ తెలంగాణపై రెండుగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఢిల్లీకి వెళ్లే ముందే తెలంగాణపై పార్టీలన్నీ తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ఢిల్లీకి వెళ్లి తెలంగాణపై అనుకూల వైఖరిని, తెలంగాణ బాధల్ని చెప్పాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. అధ్యాపకులు సి.కాశీం, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌, రాష్ట్ర నాయకుడు ఉపేందర్‌, తెలంగాణ విద్యార్థి సంస్థ(టీఎస్‌వో) నేత విజయ్‌, టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు ఎర్రోళ్ల శ్రీను, బాల్క సుమన్‌, మాదిగ విద్యార్థి సమాఖ్య నేత వంగపల్లి శ్రీనివాస్‌ తదితరులు సభలో ప్రసగించారు.



ఆధిపత్యం, ఆత్మగౌరవం మధ్య పోరాటమిది: కోదండరాం

లగడపాటి సొమ్ములు, జగన్‌ కండబలం తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేవని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పేర్కొన్నారు. తెలంగాణను ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. ఆంధ్రా ఆధిపత్యానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ పార్టీలు కూడా ఎటువైపు నిలబడతారో తేల్చుకోవాలన్నారు. ఢిల్లీలో తప్పు చేసిన వాళ్లను నిలదీయాలని, వారినేం చేయాలో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఉస్మానియా వినిపించిందని, తెలంగాణ ప్రజలకు మార్గనిర్దేశకం చేసిందన్నారు. ప్రస్తుతం రాజకీయ నేతలు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఇలా... ప్రతి వర్గంలోనూ చీలిక స్పష్టంగా కనిపిస్తోందని, ఇక విడిపోవటమేనని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను ఉస్మానియా విద్యార్థులు మలుపు తిప్పారని కొనియాడారు. తెలంగాణాలోని ప్రతి వర్సిటీలోనూ తెలంగాణ ప్రజల గోస వినిపిస్తోందన్నారు. ‘తెలంగాణలో ప్రతి పల్లెకూ ఉద్యమం పాకింది. స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా తెలంగాణ ఉద్యమం వైపు నడుస్తామంటున్నారు' అని కోదండరాం చెప్పారు. తెలంగాణ వచ్చే వరకూ పోరాటం ఆపాలని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.



పార్టీ కార్యాలయాలు కూల్చేస్తాం: జేఏసీ

జేఏసీ నేత పిడమర్తి రవి సభను ప్రారంభిస్తూ.. విడిపోయి కలిసి ఉందామని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ‘‘సంక్రాంతి పండక్కి ఆంధ్రకు మనం పోదాం. దసరాకు మనం వాళ్లను పిలుద్దాం. సంక్రాంతికి సీమాంధ్ర వాళ్లు 30 లక్షల మంది నగరాన్ని ఖాళీచేసి వెళతారు. ఉద్యమానికి అడ్డుపడితే వాళ్లను తిరిగి రానీయం'' అని హెచ్చరించారు. ఉద్యమానికి ముగింపు పలికేందుకు తెలంగాణ 120 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని డిమాండ్‌చేశారు. ‘‘రామోజీరావు వ్యూహం ఆపాలి. చంద్రబాబు తెలంగాణపై మౌనం వీడాలి. సోనియాగాంధీ మౌనం వీడాలి. జయప్రకాశ్‌ నారాయణ్‌ తన పద్ధతి మార్చుకోవాలి'' అని పేర్కొన్నారు.తెలంగాణ రాజకీయ నాయకులెవరూ చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదని విమర్శించారు. ‘‘తెలంగాణకు అడ్డొచ్చినా... ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా గాంధీభవన్‌ని కూల్చేద్దాం. ఎన్టీఆర్‌ భవన్‌ మిగలదు'' అని హెచ్చరించారు. ఢిల్లీలో 5న ఎనిమిది పార్టీలతో జరుగుతున్న సమావేశం రోజునే తెలంగాణ ఉద్యమ తీవ్రత కేంద్రానికి తెలిసేలా చేయాలన్నారు. ‘‘ఐదో తారీఖున రైల్‌రోకో చేయాలి. బస్సుల్ని తిరగనీయకూడదు. జాతీయ రహదారుల్ని దిగ్భంధనం చేయాలి. ఒక్క రైలు కూడా ఆంధ్రా వైపు తిరగనీయకూడదు. ఆంధ్రా నుంచి ఒక్క బస్సు వచ్చేది లేదు. గుజ్జర్ల తరహాలో పోరాటాలకు సిద్ధంకండి. తెలంగాణ ప్రక్రియపై కేంద్రం స్పష్టమైన తేదీలు ప్రకటించాలి' అని పిలుపునిచ్చారు. ఆంధ్రాలో ముద్దుల పోరాటం జరుగుతుందని, ఇక్కడ గుద్దుల పోరాటం జరుగుతుందన్నారు. తామందరికీ జైళ్లు... బెయిళ్లు తెలుసని.. లాఠీలు, తూటాలు తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేవని స్పష్టంచేశారు.



విద్యార్థులే నడిపించాలి

సభలో మాట్లాడిన వక్తలంతా తెలంగాణ ఉద్యమాన్ని విద్యార్థులే ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, నేతల్ని నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు. ఆట మొదలైంది. సెమీ ఫైనల్‌ వరకూ వచ్చింది. ఇక ఫైనల్‌ ఆటను విద్యార్థులే నడపాలి'' అని ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చింది విద్యార్థులేనని, ఇక ముందు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నం చేయాలన్నారు. 1969 ఉద్యమంలో 369 మంది ప్రాణత్యాగంచేసినా అప్పటి ఉద్యమాన్ని ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచి వేసిందన్నారు. కానీ ఒక్క తూటా పేలకుండానే చాలా చాకచక్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు విద్యార్థులే కారణమయ్యారన్నారు. ‘‘మన రాజకీయ నాయకులవల్లే సమైక్యాంధ్ర ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలంతా వ్యతిరేకించారు. మన నేతలు స్వార్థంతో ఆంధ్రావాళ్లతో కలిశారు'' అని అన్నారు. భూములు, ఉద్యోగాలు, చదువులు అన్నింట్లోనూ అన్యాయం జరిగిందని, నాలుగు కోట్ల ప్రజలు మాట్లాడే ప్రజల భాషను కూడా అవమానిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా, రాయలసీమ పెట్టుబడిదారులు ఆక్రమించుకున్న భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉద్యమంచేస్తున్న వారి గురించి ఆంధ్రా, రాయలసీమల్లో పత్రికలు, టీవీల్లో వార్తలు రాకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్‌, వైఎస్‌ జగన్‌, చంద్రబాబు లాంటి కొంతమంది ఆస్తులు సంపాదించుకున్న వారే నేడు తెలంగాణకు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో చర్చలు మొదలవుతున్నాయని, ఈ సమయంలోనే ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడపాలని కోరారు. 2009 ఎన్నికల్లో తెలంగాణ అనుకూలమని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారని, దమ్ముంటే చంద్రబాబు అదే మాటను ఢిల్లీకి వెళ్లి చెప్పాలన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు మద్దతు పలుకుతున్న దేవేందర్‌గౌడ్‌, కడియం శ్రీహరిని ఢిల్లీ చర్చలకు పంపటం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చంద్రబాబే ముఖ్యమంత్రి అన్న నాగం జనార్దనరెడ్డిని తెలుగుదేశం ప్రతినిధిగా ఢిల్లీ చర్చలకు పంపటంలోని ఆంతర్యం ఏమిటి'' అని ప్రశ్నించారు.

4 comments:

  1. nice speeches
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/garamchai

    ReplyDelete
  2. nice speech
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel

    ReplyDelete