
Monday, December 21, 2009
Thursday, December 17, 2009
Monday, December 7, 2009
చదువుల చెట్టుకు పోలీసు చెద
పాఠాలు వినిపించాల్సిన విశ్వవిద్యాలయం పోలీసు పద ఘట్టనలతో మార్మ్రోగుతోంది. పవిత్ర విద్యాలయంలో విద్యార్థులపై ఖాకీల లాఠీలు విరిగిపోతున్నాయి. హోం మంత్రి ఆదేశాలను కూడా ఖాతరు చేయని పోలీసు అధికారులు ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా ఉసురు తోడేస్తున్నారు... ఇదేమని అడిగే నాథుడు లేడు... ధైర్యం చేసి ఎవరైనా అడిగినా లాఠీలే వారికి జవాబు చెప్తున్నాయి... వాస్తవంగా ఉద్యమం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిని విడిచిపెట్టి విద్యార్థులపై పోలీసులు ఎందుకు కక్ష గట్టాల్సి వచ్చింది? ఏమిటీ దారుణం? విద్యాలయంలోకి పోలీసులు ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది? విశ్వవిద్యాలయంలో పోలీసుల తనిఖీలా? తరిమి కొట్టాల్సినంత పాపం విద్యార్థులేం చేశారు?
చరిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నాలుగు దశాబ్దాల తరువాత మరోసారి రక్తసిక్తమవుతోంది. అప్పుడూ.. ఇప్పుడూ ఒకే కారణం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్నదే నాడూ, నేడూ విద్యార్థుల డిమాండ్... ఆనాడు ప్రశాంతంగా ప్రారంభమైన విద్యార్థి ఆందోళన 370 మంది ఆత్మ బలిదానంతో కానీ ముగియలేదు... ఇప్పుడు ధర్నాలు.. ఆందోళనలతో ప్రారంభమైన విద్యార్థి ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదాన్ని మోపటం ప్రారంభించారు.. రాజుకున్న అగ్గిని బలవంతంగా చల్లార్చే యత్నం చేస్తున్నారు.
నవంబర్ 29న తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టింది టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు. పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేశారు.. ఇంతవరకు బాగానే ఉంది. అదే సమయంలో కెసిఆర్ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యునివర్సిటీలో విద్యార్థులు ఓ ప్రదర్శన, ఓ ధర్నా చేశారు...
ఇదంతా చిన్న నిప్పుకణిక మాత్రమే. దాన్ని రాజేసి మంటగా మార్చింది మాత్రం నిస్సందేహంగా పోలీసు బలగాలే.. విద్యార్థులపై లాఠీలు విలయతాండవం చేశాయి.. పిల్లల్ని గొడ్లకంటే హీనంగా చూశారు... తరిమి తరిమి కొట్టారు..
విద్యార్థులేమైనా హింసాత్మకంగా ప్రవర్తించారా అంటే అదీ లేదు.. శాంతి భద్రతలు అదుపుతప్పాయా అంటే అదీ లేదు...అయినా పోలీసులు ఇంత విశృంఖలంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమొచ్చింది? పరిస్థితులు చేయిదాటినట్లయితే అప్పుడు ఏం చేయాలో పోలీసుల దగ్గర బోలెడు ప్రత్యామ్నాయాలు ఉండనే ఉంటాయి. కానీ ప్రదర్శనగా వెళు్తన్న విద్యార్థులను రెచ్చగొట్టి, వాళ్లపై జులుం చేయటం ఎక్కడి పోలీస్ రూల్?
ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉద్యమం చేస్తున్నది ఏ కెసిఆర్ కోసమో కాదు.. తెలంగాణ కోసమే... నిరాహార దీక్ష మలి రోజున కెసిఆర్ విరమించారన్న వార్త వంటూనే కెసిఆర్‌పై నిప్పులు గక్కింది ఈ విద్యార్థులే... వాళ్లతో చర్చలు జరిపి శాంతియుతంగా పరిష్కారం ఆలోచించాల్సిన సర్కారు సెలవులు ప్రకటించటం ద్వారానో, ఆర్‌ఎఎఫ్‌ను పంపించటం ద్వారానో తొక్కేద్దామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి ఉండదు.
1969 నాటి ఉద్యమానికి ఉస్మానియా నాయకత్వం వహించినట్లే.. ఇప్పుడు కూడా అంతే తీవ్రంగా ఉస్మానియా ఉద్యమానికి కేంద్రమవుతుందని సర్కారు భయపడుతున్నట్లుంది.. అందుకే ఈ ఉలికిపాటు.. కలవరపాటు...
ఇవాళ 80ఏళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా చదువుల చెట్టుకు పోలీసు చెద పట్టింది. ఈ చీడను తొలగించేదెవరు? మళ్లీ చదువులు సాగేదెప్పుడు?
santosh kumar kovela
Thursday, December 3, 2009
హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం కావాలి!
Posted by డా.దార్ల
ఉద్యమాన్ని మేమే నిర్మించుకుంటాం
కూర రాజన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక కోరిక అన్నారు. విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలకు మద్దతుగా ఉద్యమాన్ని బలోపేత చేయడం ఆదర్శనీయమన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలను పక్కన బెట్టి విద్యార్థులే ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్ల రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు జంకు పుట్టించిందన్నారు. తెలంగాణ నడి బొడ్డున ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కూర రాజన్న కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ దినేష్ కుమార్, ప్రొఫెసర్లు మురళీ మనోహర్, కె. వెంకట నారాయణ, సాంబయ్యలు తదితరులు పాల్గొన్నారు.
ఓ.యులో మార్మోగుతున్న తెలంగాణ నినాదం
తార్నాక, మేజర్‌న్యూస్:ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ నినాదం మార్మోగుతున్నది. లెఫ్ట్, రైట్ అనే సిద్దాంతాలను పక్కన పెట్టి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ.యు ఆర్ట్స్ కళాశాల ముందు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాయి. అమర వీరుల త్యాగాల గుర్తు చేసుకుంటూ ….. అనవసర బలిదానాలు చేయొద్దని కోరుకుంటూ ఉద్యమాన్ని తెలంగాణ జిల్లాల్లో ప్రతి పల్లెకు విస్తరించాలని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ద్రోహుల పేరుతో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మను మంగళవారం ఆర్ట్స్ కళాశాల బస్టాప్ చెట్టు వద్ద విద్యార్థులు ఉరితీశారు.
‘‘ ఆడుదాం.. డప్పుల్లో దరువేయిరా…. పల్లె తెలంగాణ పాట పాడరా..’’ అంటూ అరుణోదయ గాయకురాలు విమల విద్యార్థుల దీక్షా శిబిరం పాల్గొన్నారు. ఇంకా గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్, వరంగల్ రవి, దరువు అంజన్న, కోటి తదితరులు తెలంగాణ పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. రాజకీయ నాయకులు 1969 నుంచి నేటి వరకు మోసం చేస్తున్నారనే అందువల్ల తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే నాయకత్వం వహించాలని, ఉద్యమాన్ని ప్రతి పల్లెకు . యూనివర్సిటీ నుంచి పాఠశాల వరకు తీసుకుపోవాలని తెలంగాణ ఐక్యకార్యాచరణ నాయకులు ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ అన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ కన్వీనర్ అల్లం.
నారాయణలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుపోవాలని అన్నారు. తెలంగాణ సాధించేవరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. తెలంగాణ టీచర్స్ ఫోరమ్ కన్వీనర్ ప్రొఫెసర్ మనోహర్ రావు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు చేపట్టే తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్లను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మంద.కృష్ణ మాదిగ మాట్లాడుతూ పరిణితో చేసిన విద్యార్థి ఉద్యమ నాయకత్వంతోనే తెలంగాణ వస్తుందన్నారు.
విద్యార్థుల దీక్షలో ఫోరమ్ ఫర్ తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మణ్, ఓ.యు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. సుదర్శన్‌రావు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ కో కన్వీనర్ పిట్టల శ్రీశైలం, ఓ.యు ప్రొఫెసర్స్ జె. ముసలయ్య, శ్రీరామ్ వెంకటేశ్, వి. జగదీశ్వర్‌రావు, మల్లేష్, చంద్రునాయక్, లక్ష్మీనారాయణ, ఇటిక్యాల పురుషోత్తం, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, పివోడబ్లు నాయకురాలు సంధ్య, ఇఫ్టూ నాయకులు ప్రదీప్, ఎస్ఎల్ పద్మ, కార్మిక నాయకులు చంద్రన్న, తెలంగాణ ఐక్యకార్యచరణ సభ్యులు ఆకుల భూమయ్య, కొల్లూరి చిరంజీవి, ఎల్హెచ్పిఎస్ నాయకులు బెల్లయ్య నాయక్, తెలంగాణ ఉద్యోగుల సంఘం విఠల్, మహాజన ఫ్రంట్ నాయకులు ఉ.సాంబశివరావు, ఓ.యు టైమ్ స్కేల్ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్‌గౌడ్, నారాయణ, ఓ.యు తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు నాగేశ్వర్, వెంకట్లు, తెలంగాణ మాదిగ దండోరా నాయకులు దేవని. సతీష్ మాదిగ, తెలంగాణ బి.సి విద్యార్థిసంఘం నాయకులు రామారావు గౌడ్, బిఎస్పి ఎ.పి నాయకులు నల్లా.సూర్యప్రకాశ్, ఓ.యు అకాడమిక్ కన్సటెంట్స్ నాయకులు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ ప్రేమయ్య, మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శ వంగపల్లి. శ్రీనివాస్ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా పాల్గొన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో పిడికిలి బిగియించిన విద్యార్థినులు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉస్మానియాయూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎప్పుడూలేనంతగా ఈ సారి అధిక సంఖ్యలో అమ్మాయిలు ర్యాలీలు, ధర్నాలు, రిలే దీక్షల్లో పాల్గొనడం గమనార్హం. అంతేకాదు పిడికిలి బిగియించి జై తెలంగాణ… జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ సాధన ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషిస్తామంటూ విద్యార్థినులు పేర్కొంటున్నారు.
Posted by నాదెళ్ళ శ్రీధర్ on డిసెంబరు 3, 2009 at 04:57