Thursday, December 3, 2009

ఉద్యమాన్ని మేమే నిర్మించుకుంటాం

వరంగల్‌, మేజర్‌న్యూస్‌ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీలతో సంబంధం లేకుండా తామే కలిసికట్టుగా పోరాడి సాధించుకుంటామని, ఇందు కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. మంగళవారం యూనివర్సిటీలోని ఎస్‌డి ఎల్‌సిఇ కేంద్రం ప్రాంగణంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను జనశక్తి నేత కూర రాజన్న, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. సీతారామారావు, మానవ హక్కుల వేదిక నాయకులు డాక్టర్‌ బుర్ర రాములు ప్రారంభించారు.
కూర రాజన్న మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామిక కోరిక అన్నారు. విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలకు మద్దతుగా ఉద్యమాన్ని బలోపేత చేయడం ఆదర్శనీయమన్నారు. రాజకీయ పార్టీల సిద్దాంతాలను పక్కన బెట్టి విద్యార్థులే ఉద్యమానికి నాయకత్వం వహించడం వల్ల రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలకు జంకు పుట్టించిందన్నారు. తెలంగాణ నడి బొడ్డున ఉన్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కూర రాజన్న కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సిహెచ్‌ దినేష్‌ కుమార్‌, ప్రొఫెసర్లు మురళీ మనోహర్‌, కె. వెంకట నారాయణ, సాంబయ్యలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment