Thursday, December 3, 2009

ఓ.యులో మార్మోగుతున్న తెలంగాణ నినాదం

ఓ.యులో మార్మోగుతున్న తెలంగాణ నినాదం
తార్నాక, మేజర్‌న్యూస్‌:ఉద్యమాల ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ నినాదం మార్మోగుతున్నది. లెఫ్ట్‌, రైట్‌ అనే సిద్దాంతాలను పక్కన పెట్టి అన్ని విద్యార్థి సంఘాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఓ.యు ఆర్ట్స్‌ కళాశాల ముందు రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాయి. అమర వీరుల త్యాగాల గుర్తు చేసుకుంటూ ….. అనవసర బలిదానాలు చేయొద్దని కోరుకుంటూ ఉద్యమాన్ని తెలంగాణ జిల్లాల్లో ప్రతి పల్లెకు విస్తరించాలని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ ద్రోహుల పేరుతో ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మను మంగళవారం ఆర్ట్స్‌ కళాశాల బస్టాప్‌ చెట్టు వద్ద విద్యార్థులు ఉరితీశారు.
‘‘ ఆడుదాం.. డప్పుల్లో దరువేయిరా…. పల్లె తెలంగాణ పాట పాడరా..’’ అంటూ అరుణోదయ గాయకురాలు విమల విద్యార్థుల దీక్షా శిబిరం పాల్గొన్నారు. ఇంకా గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్‌, వరంగల్‌ రవి, దరువు అంజన్న, కోటి తదితరులు తెలంగాణ పాటలతో విద్యార్థులను ఉర్రూతలూగించారు. రాజకీయ నాయకులు 1969 నుంచి నేటి వరకు మోసం చేస్తున్నారనే అందువల్ల తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులే నాయకత్వం వహించాలని, ఉద్యమాన్ని ప్రతి పల్లెకు . యూనివర్సిటీ నుంచి పాఠశాల వరకు తీసుకుపోవాలని తెలంగాణ ఐక్యకార్యాచరణ నాయకులు ప్రొఫెసర్‌ కేశవరావ్‌ జాదవ్‌ అన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌ కన్వీనర్‌ అల్లం.
నారాయణలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుపోవాలని అన్నారు. తెలంగాణ సాధించేవరకు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని పేర్కొన్నారు. తెలంగాణ టీచర్స్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మనోహర్‌ రావు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులు చేపట్టే తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొంటారని చెప్పారు. ఈ ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌లను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపకులు మంద.కృష్ణ మాదిగ మాట్లాడుతూ పరిణితో చేసిన విద్యార్థి ఉద్యమ నాయకత్వంతోనే తెలంగాణ వస్తుందన్నారు.
విద్యార్థుల దీక్షలో ఫోరమ్‌ ఫర్‌ తెలంగాణ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మణ్‌, ఓ.యు ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎస్‌. సుదర్శన్‌రావు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్‌ కో కన్వీనర్‌ పిట్టల శ్రీశైలం, ఓ.యు ప్రొఫెసర్స్‌ జె. ముసలయ్య, శ్రీరామ్‌ వెంకటేశ్‌, వి. జగదీశ్వర్‌రావు, మల్లేష్‌, చంద్రునాయక్‌, లక్ష్మీనారాయణ, ఇటిక్యాల పురుషోత్తం, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత, పివోడబ్లు నాయకురాలు సంధ్య, ఇఫ్టూ నాయకులు ప్రదీప్‌, ఎస్‌ఎల్‌ పద్మ, కార్మిక నాయకులు చంద్రన్న, తెలంగాణ ఐక్యకార్యచరణ సభ్యులు ఆకుల భూమయ్య, కొల్లూరి చిరంజీవి, ఎల్‌హెచ్‌పిఎస్‌ నాయకులు బెల్లయ్య నాయక్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం విఠల్‌, మహాజన ఫ్రంట్‌ నాయకులు ఉ.సాంబశివరావు, ఓ.యు టైమ్‌ స్కేల్‌ఉద్యోగుల సంఘం నాయకులు విఠల్‌గౌడ్‌, నారాయణ, ఓ.యు తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకులు నాగేశ్వర్‌, వెంకట్‌లు, తెలంగాణ మాదిగ దండోరా నాయకులు దేవని. సతీష్‌ మాదిగ, తెలంగాణ బి.సి విద్యార్థిసంఘం నాయకులు రామారావు గౌడ్‌, బిఎస్‌పి ఎ.పి నాయకులు నల్లా.సూర్యప్రకాశ్‌, ఓ.యు అకాడమిక్‌ కన్సటెంట్స్‌ నాయకులు డాక్టర్‌ లక్ష్మణ్‌, డాక్టర్‌ ప్రేమయ్య, మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శ వంగపల్లి. శ్రీనివాస్‌ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా పాల్గొన్నారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో పిడికిలి బిగియించిన విద్యార్థినులు
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఉస్మానియాయూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎప్పుడూలేనంతగా ఈ సారి అధిక సంఖ్యలో అమ్మాయిలు ర్యాలీలు, ధర్నాలు, రిలే దీక్షల్లో పాల్గొనడం గమనార్హం. అంతేకాదు పిడికిలి బిగియించి జై తెలంగాణ… జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ సాధన ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషిస్తామంటూ విద్యార్థినులు పేర్కొంటున్నారు.
Posted by నాదెళ్ళ శ్రీధర్ on డిసెంబరు 3, 2009 at 04:57

No comments:

Post a Comment